సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

Update: 2024-02-20 10:30 GMT

మహారాష్ట్ర (Maharashtra) నాసిక్‌లోని (Nasik) అంబాద్ పోలీస్ స్టేషన్‌లో (Ambad Police Station) ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ తన క్యాబిన్‌లో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు తెలిపారు. ఇన్ స్పెక్టర్ ను అశోక్ నాజన్ (40)గా గుర్తించారు. ఉదయం 10 గంటలకు జరిగిన ఈ సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అనంతరం సీనియర్ పోలీసు అధికారులందరూ అంబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. నాజన్ ఈ చర్యకు పాల్పడడం వెనుక ఉన్న కారణం ఇంకా నిర్ధారించబడలేదు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎప్పటిలాగే డ్యూటీకి రిపోర్టు చేసిన తర్వాత నాజన్ తన క్యాబిన్‌లో కూర్చున్నాడు. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో ఉద్యోగులందరి హాజరు నమోదు చేయబడుతోంది. అంతలోనే నాజన్ క్యాబిన్ నుండి తుపాకీ శబ్దం వచ్చింది. అందరూ వచ్చి అతని క్యాబిన్‌కు వచ్చి చూడగా.. అతను రక్తపు మడుగులో కుర్చీపై పడి ఉన్నాడు. నాజన్ తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆ తర్వాత తేలింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మోనికా రౌత్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శేఖర్ దేశ్‌ముఖ్, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దిలీప్ ఠాకూర్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. నాజన్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News