ఆరేళ్ల బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడినట్టు నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఏలూరులోని పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి ఎస్.ఉమాసునంద శుక్రవారం తీర్పు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన ముప్పొడి సంపతరావు(81) 2017 డిసెంబరు 23న అదే మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలికకు తినుబండారాలు కొనిస్తానంటూ లైంగిక దాడి చేశాడు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పటి గోపాలపురం ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. సంపతరావుపై నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ జడ్జి ఉమాసునంద తీర్పునిచ్చారు.
బాధితురాలికి రెండున్నర లక్షల రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం అందించాలని సిఫారసు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ రామాంజనేయులు వాదించగా ప్రాసిక్యూషన్‌కు గోపాలపురం ఎస్‌ఐ కె.సతీష్, కోర్టు కానిస్టేబుళ్ళు బుచ్చిరాజు సహకరించారు.