ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది ఆదివాసీలు మృతి చెందారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు ప్రయాణిస్తున్న వ్యాను వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడింది. ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నారని స్థానికులు తెలిపారు.
అందరూ తునికాకు సేకరణ ముగించుకొని తిరిగి సెమ్హార గ్రామం వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కవర్థ జిల్లా కలెక్టర్, ఎస్పీ.. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.
మృతి చెందిన వారిలో 14 మంది మహిళలు, నలుగు రు పురుషులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సహాయం ప్రకటించింది.