కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న 81,831 మంది వెంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.25 కోట్ల ఆదాయం సమకూరింది.
కాగా- జూన్‌లో హనుమాన్ జయంతి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో ఈ వేడుకలు జరుగనున్నాయి. జూన్ 1వ తేదీన వైభవంగా ఆరంభమౌతాయి. 5వ తేదీ వరకు కొనసాగుతాయి.
అంజనాద్రి ఆకాశ గంగ ఆలయం, జపాలి తీర్థంలో హనుమాన్ జయంతిని వేడుకలను నిర్వహించనున్నారు అధికారులు. ఈ అయిదు రోజుల పాటు ఆకాశ గంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, శ్రీ అంజనాదేవికి ప్రత్యేక అభిషేకం, జపాలి తీర్థంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తారు.