ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 22వ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కళ్యాణం నిర్వహిస్తారు. 24న పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 19న వెండి పల్లకీ సేవ, 20న రావణ వాహన సేవ, 21న వెండి రథోత్సవం, 22న నంది వాహన సేవ, 23న సింహ వాహన సేవలో ఆది దంపతులు భక్తులకు దర్శనమిస్తారు.
ఇక ఈనెల 9 నుంచి క్రోధి నామ సంవత్సర (Krodhi Nama Samvastram) ఉగాది మహోత్సవాలు ప్రారంభంకానున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు వెల్లడించారు. బుధవారం చైత్ర మాస బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఈవో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 9వ తేదీ నుంచి 18 వ తేదీ వరకు ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఉగాది (Ugadi) రోజున మధ్యాహ్నం 3 గంటలకు పంచగ శ్రవణం జరుగుతుందన్నారు.
ప్రత్యేక పుష్పార్చన సేవలు..
9 న అమ్మవారికి మల్లెపూలు, మరువముతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు
10 న కనకాంబరాలు, గులాబీలు
11 న చామంతి, ఇతర పుష్పములు
12 న మందార పుష్పములు, ఎర్ర కలువలు
13 న తెల్లజిల్లేడు, మారేడు, తులసి, మరువము, ధవళము
14 న కాగడా మల్లెలు, జూజులు, మరువము
15 న ఎర్ర తామర పుష్పములు, ఎర్ర గన్నేరు, సన్నజాజులు
16 న చామంతి, సంపంగి పుష్పములు
17 న కనకాంబరాలు, గులాబీ
18 న కనకాంబరాలు, వివిధ రకాల పుష్పములతో ప్రత్యేక పుష్పార్చణలు