Kanipakam : కాణిపాకం గణపతికి 6 కిలోల బంగారం బహుమానం

Update: 2024-03-01 07:29 GMT

Kanipakam : వరసిద్ధి దేవుడు కాణిపాకం గణపయ్యకు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇద్దరు దాతలు భారీ విరాళాన్ని సమర్పించారు. ఆరు కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారి పట్ల తమ భక్తిని చాటుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ అనే ఇద్దరు ఎన్నారైలు 20 బంగారు బిస్కెట్లను కానుకగా అందజేశారు.

ఈ భక్తులు అందించిన కానుకల విలువ రూ.ఐదు కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మొత్తం ఆరు కిలోల బంగారాన్ని స్వామివారికి సమర్పించిన సదరు భక్తులు ఇప్పటికే కాణిపాకం ఆలయం పునర్నిర్మాణం కోసం భారీ విరాళాలను అందజేస్తున్నారు. ఎన్నారైలు సమర్పించిన బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించనున్నట్లు సమాచారం.

చిత్తూరు జిల్లాలోని (Chhitoor District) ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో బావిలో వెలసిన వినాయకుడు, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వరసిద్ధి వినాయకుడు. కోరినంతనే కోరికలు తీర్చే ఈ వరసిద్ధి వినాయకుడికి భక్తులు సమర్పించే విశేష కానుకలు, ఆలయ అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. స్వామివారికి భక్తులు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లు 6 కిలోల బంగారంతో పాటు.. స్వామివారి బంగారు వాకిలి తాపడానికి అయ్యే ఖర్చు రూ.5 కోట్లు తాము ఇస్తామని తెలిపారు.

Tags:    

Similar News