తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 8 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో కొన్నింటిలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూలైన్ లోకి ఉదయం ఏడు గంటలకకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది.
నిన్న శ్రీవారిని 70,815 మంది భక్తులు దర్శించుకున్నారు. అదే సమయంలో 25,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.16 కోట్లు సమకూరింది.
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో మే 22న నృసింహ జయంతి జరుగనుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగ నరసింహస్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేస్తారని వివరించారు. శ్రీవారి ఆలయ మొదటి ప్రాకారంలో గర్భాలయానికి ఈశాన్యం వైపున గల మండపంలో పడమరగా శ్రీ యోగ నరసింహస్వామివారి ఉప ఆలయం ఉంది. శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని శాస్త్ర ప్రకారం రూపొందించారు. ఇక్కడ స్వామివారు యోగముద్రలో ఉంటారు.
స్వామివారికి నాలుగు చేతులుంటాయి. పైభాగంలో ఉన్న చేతుల్లో శంఖుచక్రాలు కనిపిస్తాయి. కింది రెండు చేతులు ధ్యాననిష్టను సూచిస్తాయి. క్రీ.శ 1330 నుంచి క్రీ.శ 1360 మధ్య కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీ యోగ నరసింహస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.