తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జూన్ 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగనున్నాయని వివరించారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.80 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.
జూన్ 17న మొదటి రోజు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు సుందరరాజ స్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారని వెల్లడించారు. జూన్ 20న రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 21న రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవను ఘనంగా నిర్వహించనున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను రద్దు చేశామని పేర్కొన్నారు.