రథ సప్తమి రోజున తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంలోని అరసవిల్లిలోని సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు ఉదయాన్నే భక్తులు పోటెత్తారు. మరోవైపు తిరుమలలో రథసప్తమి వేడుకలను టీటీడీ ప్రారంభించింది. సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామి ఊరేగింపు సాగుతోంది. యాదాద్రిలోనూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు.
ఈ ఏడాది మాఘ శుద్ధ సప్తమి ఇవాళ ఉ.7.53 నుంచి రేపు ఉ.5.30 వరకు ఉంది. నేడు ఉ.8 నుంచి మ.12 వరకు సూర్య భగవానుడి పూజకు మంచి సమయం. ఆదిత్యుడికి జిల్లేడు పత్రాలంటే ప్రీతి. ఉదయాన్నే రెండు భుజాలు, శిరస్సుపైన మూడు చొప్పున జిల్లేడు ఆకులను, వాటిపై కొద్దిగా బియ్యం ఉంచి స్నానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం. సూర్య కిరణాలు ప్రసరించే చోట రథం ముగ్గు వేసి భగవానుని పూజించాలి. పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
రథసప్తమి కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను సర్వదర్శనంలో అనుమతిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఉ.5.30కు సూర్యప్రభ వాహన సేవతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఉ.9-10 వరకు చిన్న శేష వాహన సేవ, ఉ.11-12 వరకు గరుడ వాహన సేవ, మ.1-2 వరకు హనుమంత వాహన సేవ, మ.2-3 వరకు చక్రస్నానం, సా.4-5 వరకు కల్పవృక్ష వాహన సేవ, సా.6-7 వరకు సర్వభూపాల వాహన సేవ, రా.8-9 వరకు చంద్రప్రభ వాహన సేవతో వేడుకలు ముగుస్తాయి.