శ్రీకాకుళం జిల్లా పెద్దకొజ్జిరియా ZP ఉన్నత పాఠశాలలో అరుదైన పరిస్థితి నెలకొంది. ఏడుగురు విద్యార్థులకు ఏడుగురు టీచర్లు పనిచేస్తున్నారు. గత ఏడాది 22 మంది పిల్లలు ఉండేవారు. వారిలో టెన్త్ పూర్తయిన నలుగురు వెళ్లిపోగా 18 మంది మిగిలారు. ఈ విద్యాసంవత్సరంలో 11 మంది ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. దీంతో 3, 4, 6, 7వ తరగతుల్లో ఏడుగురు మిగిలారు. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఉపాధ్యాయుల జీతభత్యాలు, మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వాహకులు, ఆయా వేతనాలు, ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు రూ.7 లక్షలకు పైగా ఖర్చవుతోంది. ఈ విషయమై శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మ్యాపింగ్ పాఠశాలల్లో విద్యార్థులతో సంబంధం లేకుండా స్కూలు అసిస్టెంట్లను నియమించాలనే ఆదేశాల మేరకు ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.