ఈనెల 15 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ప్రధానిగా మోదీ, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్‌సభలో తొలి రెండు రోజులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అనంతరం సభాపతిని ఎన్నుకుంటారు. మరునాడు రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 22వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో మోదీ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉన్నతాధికారులు రాష్ట్రపతి భవన్‌లో భద్రతా సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో వారు బస చేసేందుకు 3 ప్రత్యేక హోటళ్లు సిద్ధం చేశారు. ఆయా చోట్ల ప్రోటోకాల్‌ను అమలు చేస్తున్నారు.