ASIA CUP: ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాకిస్థాన్ అమీతుమీ
బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ విజయం.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్... ఫైనల్లో మరోసారి దాయాదుల పోరు
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు ఖరారైంది. బుధవారం జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించి, ఫైనల్లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో నిర్ణయాత్మక సూపర్ 4 మ్యాచ్‌లో బ్యాటుతో తడబడ్డప్పటికీ అద్భుత బౌలింగ్‌తో పాక్ గట్టెక్కింది. 11 పరుగుల తేడాతో నెగ్గింది. 136 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులే చేయగలిగింది. షహీన్ షా అఫ్రిది (3/17), రవూఫ్ (3/33) సైమ్ అయూబ్ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాను దెబ్బతీశారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ ఎమాన్ (0) వికెట్‌ను కోల్పోయిన బంగ్లా ఆ తర్వాత ఏ దశలోనూ నిలదొక్కుకోలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. షమిమ్ (30; 25 బంతుల్లో 2×6) పోరాటం సరిపోలేదు.
చిన్న స్కోర్లే అయినా...
భారత జట్టు ఇప్పటికే సూపర్-4 దశలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకోగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో పాకిస్తాన్ రెండో జట్టుగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, బంగ్లాదేశ్ బౌలర్ల ముందు తడబడి, కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమ్మద్ హారిస్ (31), మహమ్మద్ నవాజ్ (25) చేసిన పరుగుల కారణంగానే పాకిస్తాన్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. బంగ్లా తరఫున తస్కిన్ అహ్మద్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, బంగ్లాదేశ్‌ను నిర్ణీత లక్ష్యం చేరకుండా అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షమీమ్ హుస్సేన్ 30 పరుగులతో టార్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్లో భారత్‌తో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సైమ్ ఆయుబ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.