ASIA CUP: ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా
మరోసారి షేక్ ఆడించిన అభిషేక్... బంగ్లాదేశ్‌పై టీమిండియా విక్టరీ... తొలుత 168 రన్స్ చేసిన భారత జట్టు
ఆసియా కప్‌లో టీం ఇండియా ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 169 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ 69 పరుగులు చేశాడు. 9 మంది బ్యాటర్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
అభిషేక్ విధ్వంసమే
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు మంచి ఆరంభమే దక్కింది. మొదటి రెండు ఓవర్లలో 10 రన్స్ మాత్రమే చేసిన ఓపెనర్లు.. మూడో ఓవర్ నుంచి గేర్ మార్చారు. ముందుగా శుభ్‌మన్ గిల్ రెచ్చిపోగా.. ఆపై అభిషేక్ శర్మ ఊపందుకున్నాడు. ఈ ఇద్దరు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 72/0తో నిలిచింది. దాంతో టీమిండియా భారీ స్కోరు చేసేలా కనిపించింది. తర్వాత భారత్ వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శివమ్ దూబె (2), సూర్యకుమార్ యాదవ్ (5), తిలక్ వర్మ (5) త్వరగా పెవిలియన్ చేరారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (10 నాటౌట్) పరుగులు చేశారు. అభిషేక్ తాను ఎదుర్కొన్న తొలి 8 బంతుల్లో 8 పరుగులే చేశాడు. కానీ నాలుగో ఓవర్ నుంచి మోత మొదలైంది. నసుమ్ బౌలింగ్‌లో గిల్ వరుసగా 4, 6 బాదగా.. అభిషేక్ లాంగాన్‌లో సిక్స్ దంచేశాడు. అక్కడి నుంచి అభిషేక్ తగ్గేదేలే అన్నట్లు సాగిపోయాడు. ఏడో ఓవర్లో ఓ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో గిల్ క్యాచ్ ఔట్ కావడంతో 77 పరుగుల విధ్వంసక భాగస్వామ్యానికి తెరపడింది. సూర్య (5), తిలక్ వర్మ (5) వెంటవెంటనే ఔట్ కావడం టీమ్ఇండియాను దెబ్బతీసింది. 17 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 129/5తో నిలిచింది. అక్షర్ తోడుగా హార్దిక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. జట్టు స్కోరును 170కి చేరువగా తీసుకెళ్లాడు. అభిషేక్ ఔటయ్యాక 8.5 ఓవర్లలో భారత్ 56 పరుగులే చేయగలిగింది.
సైఫ్ హాసన్ ఒంటరి పోరాటం
బంగ్లా ఛేదనలో ఓపెనర్ సైఫ్ హాసన్ ఆటే హైలైట్. మరోవైపు నుంచి వికెట్లు పోతున్నా ధాటిగా ఆడిన అతడు భారత్ కష్టపడేలా చేశాడు. భారత ఫీల్డర్లు అనేక క్యాచ్‌లు వదిలేయడం అతడికి కలిసొచ్చింది. బంగ్లాను రెండో ఓవర్లోనే బుమ్రా దెబ్బతీశాడు. ఓపెనర్ తంజిద్ (1)ను అతడు ఔట్ చేశాడు. బంగ్లా 87/5కు పరిమితమైనా భారత్‌కు ధీమా ఉండలేని పరిస్థితి. మరోవైపు సైఫ్ పోరాటమే అందుకు కారణం. అక్షర్ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదిన అతడు.. తన దూకుడుతో కలవర పెట్టాడు. 17 ఓవర్లలో బంగ్లా 115/8తో నిలవగా.. భారత్ పట్టుబిగించింది. సైఫ్ హసన్‌ను తర్వాతి ఓవర్లోనే బుమ్రా ఔట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లో వచ్చింది.