ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సి భారత పర్యటనకు రావడం ఖాయం అని తెలుస్తోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అర్జెంటీనా జట్టు నవంబర్ 10 నుంచి 18 మధ్య కేరళలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అయితే, ఏ జట్టుతో మ్యాచ్ ఆడుతుందనే విషయం ఇంకా తెలియలేదు. ఈ మ్యాచ్ కోసం కేరళ ప్రభుత్వం కొంతకాలంగా AFAతో చర్చలు జరుపుతోంది. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక ప్రకటన కేరళలోని ఫుట్‌బాల్ అభిమానులకు పెద్ద శుభవార్తగా మారింది. మెస్సి భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2011లో, అర్జెంటీనా జట్టు కోల్‌కతాలో వెనిజులాతో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడింది. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా కేరళలో అర్జెంటీనా జట్టుకు, మెస్సికి ఉన్న అపారమైన అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.