Bandi Sanjay : రంజాన్‌కు రూ.33కోట్లు.. బోనాలకు రూ.5లక్షలా? బండి సంజయ్ ఫైర్

Update: 2024-07-29 07:30 GMT

"రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయిస్తరు. తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2.4 కోట్లు ఇస్తరు. బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని దేవాలయాలకు రూ. 5 లక్షలిస్తరా? హిందువులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నరా? మీ దగ్గర బిచ్చమెత్తుకోవాల్నా?" అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీ గల్లీలో అధికారికంగా బోనాల ఉత్స వాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ప్రకటించారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని ప్రకటించారు.

బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని వివిధ ఆలయాల సందర్శనలో బిజీ బిజీగా ఉన్న బండి సంజయ్ తొలుత చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు భాగ్యలక్ష్మీ ఆలయ సమీపంలో మీడియాతో మాట్లాడారు. భాగ్యనగర్ ఆషాడ మాసం సందర్భంగా ప్రారంభమైన బోనాల జాతర రాష్ట్ర వ్యాప్తంగా భక్తియుత ధార్మిక వాతావరణంలో వైభ నిర్వహించుకుంటున్నామన్నారు. 1908లో మూసీనది వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైతే... అమ్మవారికి మొక్కుకుంటే తగ్గి పోయిందని గుర్తు చేశారు. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మ వారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారిందన్నారు.

1869లో హైదరాబాద్ లో ప్లేగ్ వ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ వ్యాధి తగ్గితే అమ్మ వారికి గుడి కట్టించి బోనాలు జరుపుతామని అప్పటి జవాన్లు, ప్రజలు మొక్కుకున్నారని, అమ్మవారి దయతో ఆ వ్యాధి తగ్గిపోవడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నామన్నారు బండి సంజయ్.

Tags:    

Similar News