TG : వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం

Update: 2024-07-19 10:25 GMT

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కాగా నిన్న మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో జనజీవనం అస్తవస్తంగా మారింది. కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, మల్హర్, పలిమెల మండలాల్లోని లో లెవెల్ వంతెనలు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహముత్తారం మండలంలోని పెగడపల్లి- కేశవపూర్ గ్రామాల మధ్య పెద్దవాగు లో లెవల్ వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాటారం- మేడారం రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో పత్తి, వరి నార్లు నీట మునిగిపోవడంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నివాసితులు ఇబ్బందులకు గురయ్యారు.

కాగా భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ ప్రకటించింది..

Tags:    

Similar News