CM Revanth Reddy : గత పాలకుల వల్ల ప్రభుత్వానికి రూ.9వేల కోట్ల నష్టం: సీఎం రేవంత్
BHELకి గత పాలకులు టెక్నాలజీ వర్కులు కట్టబెట్టడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘బీహెచ్ఈఎల్ ఒక ఎలక్ట్రికల్ తయారీ సంస్థ. అంతకు ముందు సివిల్ పనులు ఎప్పుడైనా చేసిందా? ఆ సంస్థతో వీరు సివిల్ ఒప్పందాలు చేసుకున్నారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ కారణంగా రూ.9వేల కోట్ల వరకు సర్కారుకు నష్టం వాటిల్లింది. దీనికి ఎవరు బాధ్యులు?’ అని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ సర్కారు కమిషన్లకు కక్కుర్తి పడిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘గత ప్రభుత్వ పెద్దలు ఇండియా బుల్ నుంచి రూ.వెయ్యి కోట్లు మెక్కారు. దాని కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీని BHEL నుంచి కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇండియా బుల్స్‌తో చీకటి లావాదేవీల్లో భాగంగానే కాలం చెల్లిన టెక్నాలజీని బీహెచ్ఈఎల్‌కు నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు’ అని రేవంత్ పేర్కొన్నారు.
చంద్రబాబుకు తాను శిష్యుడినంటూ BRS చేసే ఆరోపణలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘తెలంగాణలో ఎవరైనా గ్లాసుడు మంచినీళ్లిస్తే కూడా గుర్తుపెట్టుకుంటాం. పది పదిహేనేళ్లు కలిసి పనిచేసిన సహచరుల్ని తిట్టాలని ఎక్కడైనా ఉందా? మిత్రుల్ని మిత్రుల్లాగా, సహచరుల్ని సహచరుల్లాగా, పెద్దవారిని గౌరవించేలా మా తల్లిదండ్రులు మాకు సంస్కారం నేర్పారు. భోజనం పెట్టిన ఇంటికే నిప్పు పెట్టే ఆలోచన వారి DNAలోనే ఉంది’ అని విరుచుకుపడ్డారు.