ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు ఎంపీలు, న్యాయవాదులు, కామ్రేడ్లు ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ పై కేసు నమోదైంది. వికలాంగులను అగౌరవపరిచి మాట్లా డిన స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితిరాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ అనుచిత వ్యాఖ్యలపై ఎన్టీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ బాలలత మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలోని ప్రెస్ల క్లబ్లో మీడియా సమావేశంలో బాలలత మాట్లాడుతూ 24 గంటల్లో దివ్యాంగుల రిజర్వేషన్లపై పెట్టిన పోస్ట్ ను స్మితా సబర్వాల్ వెనక్కి తీసుకోకపోతే జైపాల్రెడ్డి స్మృతివనం వద్ద అమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. స్మితా సబర్వాల్ చేసిన పోస్టు మొత్తం దివ్యాంగ సమాజాన్నే అవమానించిందని క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ మొదటి ఉద్యోగం దివ్యాంగురాలికి ఇచ్చారని బాలలత గుర్తు చేశారు. ఈక్రమంలో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించి చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై మాజీ సీఎం కేసీఆర్. కేటీఆర్ కూడా తక్షణమే స్పందించాలని ఆమె కోరారు.