తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షులు డాక్టర్ బండా ప్రకాష్ ( Banda Prakash ) బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శాసన మండలిలో కాంగ్రెస్ కు తగినంత బలం లేకపోవడంతో ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఆయన కూతురు డాక్టర్ కడియం కావ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం కావ్య వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావులతోపాటు పలువురు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యనేతలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా డాక్టర్ బండ ప్రకాష్ సోమవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీని మారేందుకు డాక్టర్ బండ ప్రకాష్ రేవంత్రెడ్డిని కలిశారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేరేవిధంగా మాట్లాడే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం కడియం శ్రీహరికి అప్పగించిందనే ప్రచారం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా డాక్టర్ బండ ప్రకాష్ తో పాటు మరో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్ రావులు ముగ్గురు కూడా ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉండే చాన్సుంది.