Telangana : అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు

Update: 2024-05-16 07:03 GMT

అన్నదాతలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళ తీరాన్ని తాకుతాయని బుధవారం ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా (నాలుగు రోజులు అటూఇటుగా) రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు.

గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది.

తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. గురువారం అన్ని జిల్లాల్లో... ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags:    

Similar News