కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో రూ. 1400 కోట్ల మాయంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటున్నది. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఐదు మందిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారంపై సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఆధారాలను సేకరించారు. 75 మంది పన్నులు చెల్లింపుదారులు కార్యకలాపాల వివరాలను నిందితులు ఉద్దేశపూర్వకంగా ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసినట్లు తెలుస్తోంది. పన్ను ఎగవేతకు నిందితులు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కాంలో కమర్షియల్ ట్యాక్స్ , ఐఐటీ హైదరాబాద్ మధ్య జరిగే లావాదేవీలను కూడా పక్కదారి పట్టినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఐఐటీ సాఫ్ట్‌వేర్‌లోని సమాచారాన్ని స్పెషల్ ఇనిషియేటివ్ వాట్సప్ గ్రూప్‌కు చేరేలా ఆదేశాలు జారీ అయ్యాయని.. ఆ గ్రూప్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణా బేవరెజస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారా కమర్షియల్ ట్యాక్స్‌కు వేయి కోట్లు నష్టం వాటిన్నట్లు సమాచారం. మరో 11 ప్రైవేటు సంస్థలు రూ.400 కోట్ల వరకు పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరికొంత మందికి సీసీఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. అసెంబ్లీలో చర్చ తర్వాత అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ -5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. మాజీ సీఎస్‌తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు అయ్యింది. సీసీఎస్‌లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయ్యింది.