తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో ఎన్ఆర్‌ఐల సహకారం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) అన్నారు. యూఎస్ పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో NRIలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘సీఎం అయ్యాకా కుటుంబ పాలనలో పదేళ్ల దోపిడి కాదు.. వందేళ్ల విధ్వంసం జరిగిందని గ్రహించా. బీఆర్ఎస్ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించింది. వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాను’ అని తెలిపారు. అంతకుముందు ఆయనకు స్థానికంగా ఘనస్వాగతం లభించింది.
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. న్యూజెర్సీలో NRI సెల్ టీపీసీసీ ఆధ్వర్యంలో షెరటాన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరై.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్‌ఆర్‌ఐలను కోరారు. పెట్టుబడుదారులకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామమన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలని పిలుపునిచ్చారు.