KTR : నవంబర్‌10లోగా బీసీ గణన పూర్తి చేయాలి : కేటీఆర్

Update: 2024-09-19 07:30 GMT

వచ్చే నవంబర్‌ 10వ తేదీలోగా బీసీ గణన పూర్తి చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ కేటీఆర్ డిమాండ్‌ చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనన్నారు. అమలు జరిగే వరకు కాంగ్రెస్‌ సర్కారును నిలదీస్తామని.. 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ బీసీ నేతలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ పేరుతో చేసిన మోసంపై పార్టీకి సంబంధించిన బీసీ నేతలతో చర్చించినట్లు తెలిపారు. వెంటనే సమగ్ర కులగణన ప్రారంభించి.. నవంబర్‌ 10వ తేదీలోగా పూర్తి చేయకుంటే బీసీల తరఫున ఎలా ముందుకువెళ్తామన్న దానిపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కేటీఆర్ హెచ్చరించారు. బీసీలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ ఇస్తామని చెప్పి రూ.8వేలకోట్లు మాత్రమే బడ్జెట్‌లో పెట్టారని విమర్శించారు. బీసీ సబ్‌ప్లాన్‌ తీసుకురావాలన్నారు. రూ.25వేల నుంచి రూ.35వేలకోట్లు పెట్టాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల వాటా పెంచాలన్నారు. ఎంబీసీలకు మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామన్నారని.. హామీ ఇచ్చిన మేరకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కేబినెట్‌లో ఇద్దరు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారన్నారు. నేతన్నలు సంక్షోభంలో ఉన్నారని.. చేపపిల్లల పంపిణీ ఆపేసి గంగపుత్రుల పొట్టగొడుతున్నదని ధ్వజమెత్తారు. బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్‌ పోరాడుతుందన్నారు. బీసీ డిక్లరేషన్‌లోనే దాదాపు దాదాపు 70 హామీలు ఉన్నాయని, బీసీల కోసం బీఆర్‌ఎస్‌ కదిలిందన్నారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్దదిక్కుగా బీఆర్‌ఎస్‌ ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. వచ్చే ఎన్నికల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలను రద్దు చేస్తారా? బీఆర్‌ఎస్‌ నేత ప్రశ్నించారు. ఈ జమిలీ ఎన్నికలపై పార్టీ నేతలమంతా కూర్చొని చర్చించి నిర్ణయిస్తామన్నారు.

Tags:    

Similar News