కొత్త పెన్షన్లను త్వరలోనే అందజేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. అలాగే కొత్త రేషన్ కార్డులూ ఇస్తామని, ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. చౌకధరల దుకాణాల్లో రేషన్ తీసుకునేందుకు, సంక్షేమ పథకాలను పొందేందుకు వేర్వేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని వివరించారు.
వచ్చే మార్చి నాటికి ఎట్టి పరిస్థితుల్లో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగి తీరాలని జెన్‌కో అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి నాలుగు యూనిట్లను దశల వారీగా వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.