ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో ఇచ్చింది. ఈ జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేయగా.. ఈ నెల 15న న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని మీర్ ఆలం ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సీపీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘కేసు దర్యాప్తు రైట్ లైన్‌లో జరుగుతున్నది. పొలిటికల్ లీడర్లకు నోటీసులకు సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు. కాగా, రంజాన్ సందర్భంగా సిటీలో బందోబస్తును సీపీ పర్యవేక్షించారు.