POLITICS: కేసీఆర్, జగన్ అరెస్ట్ తప్పదా.?
తెలుగు రాష్ట్రాల్లో రసవత్తర రాజకీయం;
తెలుగు రాష్ట్రాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ మెడకు ఉచ్చు బిగుస్తుండగా... తెలంగాణలో కాళేశ్వరం కుంగుబాటు అంశంలో మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ పరిణామాలతో అటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ రాజకీయాలు వేడెక్కాయి. తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రుల అరెస్ట్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ప్రతిపక్షాలు... తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని అధికార పక్షాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దర్యాప్తు సంస్థలు.. ఈ ఇద్దరు నేతలను అరెస్ట్ చేస్తాయా..? లేదా సంయమనం పాటిస్తాయా అన్నది ఉత్కంఠగా మారింది.
కేసీఆర్ కు తిప్పలు తప్పవా..?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్‌రావు, ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ నోటీసులతో తెలంగాణలో రాజకీయం మరింత వేడెక్కింది. నోటీసులపై బీఆర్‌ఎస్ మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోంది. అసలు వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేదే బీఆర్‌ఎస్, బీజేపీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నెలకొన్న అనుమానాలపై సమాధానం చెప్పాలని పేర్కొంది. ఇదే ఇప్పుడు తెలంగాణలో రాజకీయ రచ్చకు కారణమైంది. దీనిపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. అయితే కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్.. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అన్న దానిపై మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా... ఒక వేళ హాజరైతే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై విస్తృత చర్చ జరుగుతోంది. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని గులాబీ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ ప్రభుత్వం చేస్తుందా అన్నది ఉత్కంఠను రేపుతోంది.
జగన్ అరెస్ట్ తప్పదా..?
మద్యం కమిషన్ల కేసులో మాజీ సిఎమ్ జగన్ అరెస్ట్ అనివార్యం అని తెలుస్తోంది. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. అయితే కక్ష సాధింపుగానో, హడావుడిగానో చేసే అరెస్ట్ గా కాకుండా, పూర్తిగా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించి ప్రాపర్ గా దర్యాప్తు జరిపి, ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా చూసుకుంటూ ముందుకు వెళ్లాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ఎన్ని రోజుల్లో జగన్ అరెస్ట్ వుంటుందన్నది తెలియదు కానీ అరెస్ట్ తథ్యం అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేవలం వంద కోట్ల లిక్కర్ స్కామ్ కే ఢిల్లీలో అరెస్ట్ లు జరిగాయి. ఏపీలో జరిగింది వేల కోట్ల స్కామ్ అందువల్ల అరెస్ట్ అనేది పెద్ద వింత, విడ్డూరం కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గత రెండు వారాలుగా లిక్కర్ కమిషన్ల కుంభకోణం మీద పలు కథనాలు మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ కుంభకోణం ఎలా జరిగింది అన్నది అరటి పండు వలిచినట్లు వివరించేలా వుంటున్నాయి. అలాగే డబ్బు ఎలా ఎలా చేతులు మారింది, బంగారం రూపంలోకి ఎలా మారింది. ఎక్కడ బంగారం, ఎంత కొన్నారు ఇలా ప్రతి ఒక్కటీ ఈ కథనాల్లో వివరిస్తూ వస్తున్నారు. లిక్కర్ కుంభకోణం ఎలా జరిగింది అన్నది ఇప్పటికే జనాలకు క్లారిటీ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఎండ్ పాయింట్ మాత్రమే మిగిలింది. ఆ పాయింట్ జగన్ అనే విధంగా అన్ని సాక్ష్యాధారాలు సమకూర్చుకోవడం అన్నది ఇప్పుడు జరుగుతున్న పని. వన్స్ అది ఫైనల్ కు చేరితే జగన్ అరెస్ట్ అనివార్యం. అది ఎంతో దూరంలో లేదు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరోవైపు... మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ జగన్ అరెస్ట్ తప్పదనే వార్తలు, ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ వీటిపై స్పందించారు. మద్యం కుంభకోణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరెస్టుల ప్రచారాన్ని ఖండించారు. తాను విజయవాడలోనే ఉన్నానని అరెస్టు కోసం వచ్చేవారికి స్వాగతిస్తానని తెలిపారు.