తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న జగిత్యాల జిల్లా వెల్గటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాదిలో రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. పలు ప్రాంతాల్లో 46కు పైగా టెంపరేచర్ రికార్డు అయింది. నేడు నిర్మల్, ఆసిఫాబాద్ , మంచిర్యాల, నిజామాబాద్ , జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ కొత్తగూడెం, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, కొత్తగూడెం.. ఎల్లుండి భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబలో వానలు పడతాయని పేర్కొంది.
మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురవనుందని హైదారాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురవనున్నట్లు పేర్కొంది. కొత్తగూడెం, జనగామ, మహబూబ్ నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ , వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వాన పడనున్నట్లు వెల్లడించింది. మరోవైపు పిడుగుపాటుకు వరంగల్, ఏటూరునాగారంలో ఇద్దరు రైతులు మృతి చెందారు.