RTC Conductor Suspended : కండక్టర్‌పై సజ్జనార్ వేటు.. ఏం జరిగిందంటే?

Update: 2024-08-09 11:15 GMT

ఓ ప్రయాణికురాలి పట్ల అమ ర్యాదగా, అనుచితంగా ప్రవర్తించిన ఆర్టీసీ కండక్టర్ పై వేటు పడింది. జనగామ డిపోకు చెందిన బస్సులో ఓ మహిళ తన తల్లి, ఏడాది వయ స్సున్న కుమారుడితో ప్రయాణిస్తుండగా.. ఆమె పట్ల అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించటంతో పాటు వారిని బస్సు ఆపి మధ్యలోనే దించేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు రాగా.. విచారణ చేపట్టిన ఆర్టీసీ ఉన్నతాధికారులు కండక్టరు విధుల నుంచి తప్పించారు. ఈ విషయాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో వెల్లడించారు.

ఈ నెల 1వ తేదిన ఒక మహిళ, తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హనుమకొండ నుంచి హైదరాబాద్ కు జనగామ డిపోకు చెందిన బస్సు ఎక్కారు. వీరంతా మొదటి వరసలో ఉన్న మహిళా రిజర్వ్ సీట్లలో కూర్చున్నారు. ఆ సమయంలో ఆ సీట్లను ఖాళీ చేయాలంటూ కండక్టర్ శంకర్ వారితో అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించారు. లేకుంటే బస్సు దిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. తన అమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పినా వినకుండా ముగ్గురిని నిర్ధాక్షిణ్యంగా మడికొండ వద్ద కండక్టర్ బస్సులోంచి దింపేశారని ఆ మహిళ అక్కడున్న వారికి సమాచారం అందించారు.

విషయాన్ని బాధిత మహిళా ప్రయాణికురాలి భర్త సోషల్ మీడియా ద్వారా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకు వచ్చారు. అందుకు సంబంధించిన వివరాలతో పాటు బస్సు డ్రైవర్, కండక్టర్ ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ ఘటనపై యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో మహిళా ప్రయాణికురాలి పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించటం, నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యలోనే బస్సులోంచి వారిని దించినట్లు తేలడంతో కండక్టర్ శంకర్ ను విధుల నుంచి తప్పించారు.

టీజీఎస్ ఆర్టీసీ నియమ నిబంధనల మేరకే కండక్టర్ పై చర్యలు తీసుకున్నామని యాజమాన్యం ప్రకటించింది. గతంలోనూ ఆరోపణలు రావడంతో ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేయడంతో పాటు ఒక సారి విధుల నుంచి తొలగించడం జరిగిందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. 12 సార్లు కండక్టర్ శంకర్ పై ఫిర్యాదులు వచ్చాయని అయినా అయన వైఖరిలో మార్పు రాలేదని.. మనిషి మారుతాడన్న మానవతా ధృక్పథంతో సంస్థ ఆయనకు పోస్టింగ్ ఇచ్చామని తెలిపింది.

Tags:    

Similar News