SUREKHA: మరోసారి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్‌ను కేటీఆర్ చంపేశారేమో అని అనుమానం.. భగ్గుమన్న బీఆర్ఎస్;
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు అసలే పదవీ కాంక్ష ఎక్కువని... కేసీఆర్ బయటకు కనిపించడం లేదని.. అయన తల పగులకొట్టి చంపేశారేమో అని మంత్రి కొండా సురేఖ అనుమానం వ్యక్తం చేశారు. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదన్నారు. కొండా సురేఖ గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. కేసీఆర్ బాగుండాలని కోరుకోవాలన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరేనని కొండా సురేఖ అన్నారు. అతనే సీఎం అనుకుని కేటీఆర్ పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారంటూ మంత్రి మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదని సురేఖ అన్నారు.
సమంతకు సురేఖ క్షమాపణ
చైతూ-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమంతకు మంత్రి క్షమాపణ చెప్పారు. ‘నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. మీరంటే నాకు అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
పరువునష్టం దావా వేసిన నాగార్జున
అక్కినేని కుటుంబంపై, హీరోయిన్ సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దూమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున పరువునష్టం దావా వేశారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు.
కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సురేఖకు నోటీసు ఇచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. సురేఖపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలని కోరారు. సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారని గుర్తు చేశారు. ఏది ఏమైనా సురేఖ వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ కు అనుకూలంగా మారగా.. కాంగ్రెస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి.