AP: చంద్రబాబు వద్ద పనిచేయడం ఆనందకరం: సీఎస్‌

ఏపీ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ కుమార్ ప్రసాద్...;

Update: 2024-06-08 04:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్... బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య నీరబ్ కుమార్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి..సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.., PCCF వై.మధుసూదన్ రెడ్డి, ఐటీశాఖ కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్ తదితరులు హాజరయ్యారు. ఈ నెలాఖరుకు నీరబ్ కుమార్ ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇప్పటి వరకు సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి నిన్ననే సెలవుపై వెళ్లారు.


విజనరీ లీడర్‌గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సీఎస్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ సంతోషం వ్యక్తం చేశారు. సీఎస్‌గా తొలి బాధ్యతగా.. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, భారత ప్రధాని పర్యటనను పర్యవేక్షించటం వంటి కీలక కార్యక్రమాలపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి మంగళగిరి ఎయిమ్స్, గన్నవరం విమానాశ్రయం వద్ద రెండు స్థలాల పరిశీలన జరిగిందని తెలిపారు. స్థలం ఖరారుగానే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయటానికి ప్రభుత్వ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని సీఎస్‌ తెలిపారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈనెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్‌ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేక పోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు  చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్‌ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు. 

Tags:    

Similar News