AP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ద్వారకా తిరుమలరావు
చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం... ఉత్తర్వులు జారీ;
ఆంధ్రప్రదేశ్ కొత్త పోలీస్ బాల్ వచ్చారు. ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా చంద్రబాబు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో ఎస్పీగా పనిచేశారు. అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది.
కుటుంబ నేపథ్యం...
ద్వారకా తిరుమలరావు గుంటూరువాసి కాగా.. దేవాపురంలో సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ విభాగంలో అధికారి కాగా.. ఆయనకు తిరుమలరావు సహా ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. తిరుమలరావు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించారు.. కృష్ణ నగర్‌లోని మున్సిపల్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరు లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. సెంట్రల్ యూనివర్సిటీలో మేథ్స్‌లో గోల్డ్‌మెడల్ అందుకున్నారు. తిరుమలరావు కొంతకాలం గుంటూరు టీజేపీస్ కళాశాలలో మేథమేటిక్స్ లెక్చరర్‌గా పని చేశారు. తిరుమలరావు 1989లో ఆయన ఐపీఎస్‌రకు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్ కాగా.. వారికి ఇద్దరు కుమార్తెలు.