వచ్చే నెల 15 నుంచి అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో 183 క్యాంటీన్లు తెరవాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతపడిన వీటన్నింటికి రూ.20 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నారు. ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 22వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. గతంలో ప్రారంభించిన 183 క్యాంటీన్లను రూ.20 కోట్లతో పుర, నగరపాలక సంస్థలు మరమ్మతులు చేయనున్నాయి. క్యాంటీన్లలో ఐవోటీ డివైజ్‌ల ఏర్పాటు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ కోసం రూ.7 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. 20 క్యాంటీన్లకు కొత్త భవనాల నిర్మాణం, పాత పెండింగ్ బిల్లుల చెల్లింపులకు మరో రూ.65 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనుంది.
తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. ఇందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. నెలాఖరులోగా ఆహార సరఫరా టెండర్లు ఖరారు చేయనున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ తయారుచేస్తున్నారు. క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తున్నారు. వీటికి ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుందని అధికారులు చెబుతున్నారు.