AP: ఏపీలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ

స్వయంగా ఇంటికివెళ్లి అందించిన చంద్రబాబు... లోకేశ్‌తో కలిసి పింఛన్ల అందజేత;

Update: 2024-07-01 01:00 GMT

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మూడు నెలల బకాయితో కలిపి ఒకేసారి రూ.7 వేలు పెన్షన్‌ పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. పెన్షన్ల పంపిణీని పండుగలా నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో భాగమవుతున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో సీఎం చంద్రబాబు పింఛను పంపిణీని ప్రారంభించారు. మంత్రి లోకేశ్‌, ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం.. లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పింఛను అందజేశారు. లబ్ధిదారు కుటుంబసభ్యులతో మాట్లాడారు. పెనుమాకలోని సుగాలికాలనీకి చెందిన బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబం చంద్రబాబు నుంచి తొలి పింఛన్‌ అందుకున్నది. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్‌, ఆయన కుమార్తె ఇస్లావత్‌ శివకుమారికి వితంతు పింఛన్‌ను వారి ఇంటి వద్ద చంద్రబాబు స్వయంగా అందజేశారు. పింఛన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయన పర్యటన నేపథ్యంలో పెనుమాక గ్రామం ముస్తాబయ్యింది.


ఎవిరికి ఎంత పెన్షన్‌

ఇప్పటి వరకు పింఛనుదారులకు రూ. 3,000 చొప్పున అందుతుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి రూ. 1,000 పెంచి రూ. 4,000 చేశారు. దీంతోపాటు ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు రూ. 1,000 చొప్పున కలిపి రూ. 7,000 నేడు పంపిణీ చేస్తున్నారు.


ఇచ్చిన హామీ మేరకు...

సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఐదు హామీలపై మొదటి ఐదు సంతకాలు చేసిన చంద్రబాబు వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పెన్షన్లు పంపిణీకి శ్రీకారం చుట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో సచివాలయ ఉద్యోగులకు పెన్షన్ల పంపిణీ బాధ్యత అప్పగించకుండా అకౌంట్లలో జమచేసి పెన్షన్‌దారులను ఇబ్బందులు పెట్టారు. 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పటికీ అప్పట్లో అధికారులు అంగీకరించలేదు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పకడ్బందీగా పెన్షన్ల పంపిణీ చేపట్టవచ్చని నిరూపించేందుకు కూటమి సర్కార్‌ చర్యలు ప్రారంభించింది.

Tags:    

Similar News