AP: కరవు తాండివిస్తున్నా నిర్లక్ష్యం వీడని జగన్
మండిపడ్డ ప్రతిపక్షాలు, రైతులు.... ఏపీలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్నాయని ఆవేదన;
ఆంధ్రప్రదేశ్‌లో కరవు తాండవిస్తుంటే సీఎం జగన్ దాని తీవ్రతను తక్కువ చేసి మాట్లాడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. తీవ్ర దుర్భిక్ష పరిస్థితులతో జనం వలసలు పోతుంటే కనీసం జగన్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వ గెజిట్‌పై సీపీఐ చేపట్టిన 30గంటల నిరసన దీక్షకు నేతలు సంఘీభావం ప్రకటించారు. కరవు పరిస్థితులపై నియోజకవర్గ స్థాయి నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు కృష్ణా జలాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగితే సీఎం జగన్ కనీసం నోరు మెదపకపోవడాన్ని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడలో చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించిన నేతలు... కరవు పరిస్థితులతో ఊళ్లకు ఊళ్లు వలసపోతుంటే జగన్‌కు పట్టడం లేదని విమర్శించారు. తనపైన ఉన్న అవినీతి కేసులకు భయపడే కేంద్రాన్ని జగన్ ప్రశ్నించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారును ప్రజలు ఓడిస్తారని హెచ్చరించారు.
పోలవరంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నేతలు ఆక్షేపించారు. కరవు నష్ట పరిహారాన్ని అంచనా వేయడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. విభజన హామీలు సాధిస్తానని గద్దెనెక్కిన జగన్ నేడు వాటిని మరచారని నేతలు మండిపడ్డారు. నదుల్లో నీరు లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని విమర్శించారు. కేబినెట్ సమావేశం నిర్వహించి కరవు పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో కరవుతో ఎండిపోయిన పంటలను రైతులు తీసుకొచ్చి సభా వేదిక వద్ద ప్రదర్శించారు. కరవు పరిస్థితులను ప్రభుత్వం సక్రమంగా అంచనా వేసి నష్ట పరిహారం ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. వేసవిలో వేసే పంటకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలని కోరారు. రైతులకు రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన కరవు సమస్య, కృష్ణా జలాల పునఃపంపిణీలో కేంద్రం గెజిట్ పై CPI ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి రామకృష్ణ చేపట్టిన దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కృష్ణా మిగులు జలాల పంపిణీ విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. అయినా సీఎం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 440కి పైగా మండలాల్లో రైతులు కరవుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కరవు లేదని చెబుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆక్షేపించారు. కరవు నష్ట పరిహారం అంచనా వేయడంలో వైకాపా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని CPM ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. CM జగన్ కు వ్యవసాయంపై అవగాహన లేనందునే రైతులు ఇబ్బందిపడుతున్నారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు.