YS FAMILY: జగన్ ఓ విషపు నాగు
జగన్, షర్మిల మధ్య ముదిరిన ఆస్తుల వివాదం... అయిదేళ్లు గాడిదలు కాశారా అని సూటి ప్రశ్నలు;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం మరింత ముదురుతోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల... వైఎస్ జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఛార్జిషీట్‌లో వైఎస్ పేరు చేర్చిందే జగన్ అని పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు పొన్నవోలుతో కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. వైఎస్ మరణానికి సీఎం చంద్రబాబు కారణమైతే ఐదేళ్లు అధికారంలో ఉండి గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు అని సూటి ప్రశ్నలు సంధించారు. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. స్వప్రయోజనాల కోసం తల్లిని కోర్టుకీడ్చిన విషపు నాగు జగన్ అని షర్మిల ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
షర్మిల సూటి ప్రశ్నలు
వైఎస్ షర్మిల... జగన్, వైసీపీ నేతలకు సూటి ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్ హత్య కేసులో చంద్రబాబు ఉంటే జగన్ ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదని సూటిగా ప్రశ్నలు సంధించారు. దర్యాప్తు చేసి నిజానిజాలు ఎందుకు బయటపెట్టలేదు? దోషులను ఎందుకు శిక్షించలేదు? అని ప్రశ్నించారు. అనుమానం ఉండి.. ఐదేళ్లు అధికారంలో ఉండి.. ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వేయలేదని నిలదీశారు. ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా’ అని ధ్వజమెత్తారు. రాజశేఖర్‌రెడ్డి మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదన్నారు. కాంగ్రె్‌సను ఆయన రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని.. బంగారు బాతును ఎవరూ చంపుకోరని.. సొంత కళ్లను ఎవరూ పొడుచుకోరని స్పష్టం చేశారు. వైఎస్ మరణం తర్వాత చార్జిషీటులో ఆయన పేరు చేర్పించింది జగన్ కాదా అని ప్రశ్నించారు. ‘కేసుల నుంచి బయటపడేందుకు పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలసి ఈ కుట్ర చేయలేదా? కుట్ర చేయకపోతే జగన్ సీఎం అయిన వెంటనే అదనపు అడ్వకేట్ జనరల్ పదవి ఆయనకు ఎందుకిచ్చారని దుయ్యబట్టారు.
జగన్‌కు చంద్రబాబు పిచ్చి
జగన్‌కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడినట్లు లేదని అన్నారు. ‘ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. బాబే కనిపిస్తున్నట్లుంది’ అని ఎద్దేవాచేశారు. బాబు కళ్లలో ఆనందం చూడడానికో.. ఆయన బ్రాండింగ్‌ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో పనిచేయాల్సిన అవసరం వైఎస్ బిడ్డకు ఎప్పటికీ రాదన్నారు.
విజయసాయిరెడ్డికి షర్మిల సవాల్
వైఎస్ మృతికి కారణమైన చంద్రబాబుతో షర్మిల చేతులు కలిపారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. 'సాయిరెడ్డి గారు.. మీరు చదివింది జగన్ గారి స్క్రిప్ట్ కాదని ప్రమాణం చేయగలరా? ఆస్తుల గురించి నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాటా ఉంటుందన్న YSR మ్యాండేట్ అబద్ధమని మీ బిడ్డల మీద ప్రమాణం చేయగలరా ?' అంటూ ట్వీట్ చేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లు ఇలానే మాట్లాడుతారని ఫైర్ అయ్యారు.