Chandrababu: ఇక వైసీపీ ఆటలు సాగవు.. ఖబర్దార్.. జాగ్రత్త: చంద్రబాబు
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన కొనసాగుతోంది.;
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన కొనసాగుతోంది. కుప్పంలో రెండో రోజు పర్యటించిన ఆయన.. రోడ్ షోల్లో పాల్గొని పార్టీ క్యాడర్‌లో జోష్ నింపారు. ఈ టూర్‌లో వైసీపీ సర్కారు వైఫల్యాలను తూర్పారబట్టారు. జగన్ సర్కారుది విధ్వంస పాలనంటూ నిప్పులు చెరిగారు. చెత్త పన్నులు, అధిక ధరలతో పేదల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు చంద్రబాబు.
చంద్రబాబు R&B గెస్ట్ హౌస్‌లో ఉన్నారని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అక‌్కడికి చేరుకున్నారు. షాహి గార్మెంట్ మహిళా కార్మికులు సైతం కలిశారు. యాజమాన్యం తమకు జీతాలు పెంచడం లేదని.. వెట్టిచాకిరీ చేయించుకుంటుందని వాపోయారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. అంతకు ముందు చిగలపల్లి గ్రామంలో చంద్రబాబుకు అడుగడుగునా గ్రామస్తులు హారతులు పట్టారు. అక్కడ చిగలపల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ద్రవిడ యూనివర్శిటీ విద్యార్ధులతోనూ మాట్లాడారు చంద్రబాబు. యూజీ, పీజీ కోర్సులు తీసివేయడం దారుణమన్నారు. యూనివర్శిటీని నామరూపాలు లేకుండా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. విద్యార్ధుల భవిష్యత్‌ను ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు చంద్రబాబు. చంద్రబాబుకు తమ సమస్యలు చెప్పుకున్నారు విద్యార్ధులు. యూనివర్శిటీలో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. జై సీఎం చంద్రబాబు అంటూ.. విద్యార్ధులు నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన లేదని.. పెట్టుబడులన్నీ పారిపోతున్నాయంటూ మండిపడ్డారు చంద్రబాబు. గ్యాస్‌పై జగన్ సర్కార్ 330 రూపాయలు వసూలు చేస్తోందని అన్నారు. ఇక రైతు భరోసా కింద 12 వేలు ఇస్తానని చెప్పి.. 6 వేలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు. మొత్తానికి ఈ పర్యటనతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు చంద్రబాబు. జగన్ సర్కారుపై విరుచుకుపడుతూనే.. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనంటూ భరోసా ఇస్తున్నారు.