తెలంగాణ, ఏపీ సీఎంలు చంద్రబాబు ( N. Chandrababu Naidu ), రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తొలిసారి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. జులై 3వ వారంలో హైదరాబాద్ లోని HICCలో జరిగే ప్రపంచ కమ్మ మహాసభ కార్యక్రమంలో సీఎంలు పాల్గొనబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతంలో టీడీపీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ సీఎం అయ్యారు. చాలాకాలం తర్వాత ఇరువురిని ఒకే వేదికపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతంలో చంద్రబాబుకు సహచరుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంలో ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కాగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు.
అయితే ఇప్పటి వరకు ఈ ఇరువురు పరస్పరం ఎదురుపడలేదు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అంతా భావించినా ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో కమ్మ మహాసభలకు హాజరైతే ఈ ఇరువురు ఒకేసారి ఒకే వేదికను పంచుకునే అవకాశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.