వైసీపీ నేత, ఎమ్మె్ల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కార్యాలయం ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దువ్వాడ కుటుంబ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కడంతోపాటు.. మరో మహిళతో ఆయన కలిసి ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. చాలాకాలం కిందటే ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ, అప్పట్లో చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా సస్పెండ్ చేశారు.