వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో పవన్‌ను ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని వివరించారు. కాగా పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఆయన ఎన్నికల ముందు శపథం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన కూటమి 164 శాసనసభ, 21 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది.
కోట్లాది రూపాయాలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని.. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు ముద్రగడ. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా..? లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటు మొగ్గారో తెలియడం లేదన్నారు.