వైసీపీ నుంచి తాడిపత్రిని జనం కాపాడుకున్నారు : జేసీ ప్రభాకర్‌రెడ్డి
తాడిపత్రిలో టీడీపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. వైసీపీ నుంచి తాడిపత్రిని జనం కాపాడుకున్నారన్నారు.;
తాడిపత్రిలో టీడీపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. వైసీపీ నుంచి తాడిపత్రిని జనం కాపాడుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని, ఎస్సీ ఎస్టీ కేసులతో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. వైసీపీ దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు. ఈ ఆగడాలను ఆపాలనే తాడిపత్రి ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే టీడీపీని గెలిపించుకున్నారన్నారాయన.
రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా సరే.. తాడిపత్రిలో మాత్రం సైకిల్ గుర్తు సత్తా చాటింది. మొత్తం 36 వార్డులకు గాను 18 వార్డులను టీడీపీ కైవసం చేసుకోగా.. మిత్రపక్షం సీపీఐ ఒక వార్డులో గెలిచింది. వైసీపీ 14 వార్డుల్లో గెలుపొందింది. సీపీఐ గెలిచిన వార్డుతో కలిపి మ్యాజిక్ ఫిగర్ 19ని చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో విజయం.. జేసీ కుటుంబానికి, జగన్‌కు మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణిస్తున్నారు జేసీ వర్గీయులు.