ఏపీలో ఘోర పరాజయం పాలైన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు విజయవాడ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విజయవాడ ప్రజలు తనకు రెండుసార్లు ఎంపీగా అవకాశం కల్పించారని, వారందరికి ధన్యవాదాలు చెబుతున్నానని కేశినేని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కేశినేని నానిపై టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన సోదరుడు కేశినేని చిన్ని ఘన విజయం సాధించారు. దీంతో రాజకీయాల నుంచి వైదొలగాలని కేశినేని నాని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ అనుభవాలు, జ్ఞాపకాలను నాతో తీసుకెళ్తున్నా.. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేశా.. అపురూపమైన అవకాశం కల్పించిన ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు అంటూ కేశినేని నాని ఎమోషనల్ ట్వీట్ చేశారు.