ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మరో ఆసక్తికరమైన ప్రకటన చేశారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తనని కలిసేందుకు వస్తున్న వారికి పవన్ ఒక విజ్ఞప్తి చేశారు. అభినందనలు తెలిపేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని కోరారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి అభినందనలు.. శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీరంగంలో ఉన్నవారు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు అభినందనలు చెబుతున్నారని అన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు తనని కలిసేందుకు ఆశిస్తున్నారని అన్నారు. జిల్లాల వారీగా కలిసి మాట్లాడుతానని చెప్పారు. షెడ్యూల్‌ను కేంద్ర కార్యాలయం ద్వారా తెలియజేస్తానని చెప్పారు పవన్ కల్యాణ్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తానని అన్నారు. దశల వారీగా గ్రామాల్లో పర్యటిస్తానని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పారు.