MODI: వైసీపీ ప్రభుత్వ కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఇక ఇంటికి పోవడమే మిగిలిందన్న ప్రధాని మోదీ... ప్రజలను జగన్‌ మోసం చేశారని ఆగ్రహం

Update: 2024-05-09 00:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు ఇంటికెళ్లేందుకు కౌంట్‌డౌన్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ఏపీలో అభివృద్ధే లేదన్న మోదీ, నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను వైసీపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయి పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆయన NDA అధికారంలోకి వచ్చాక అన్ని మాఫియాలకూ పక్కా ట్రీట్‌మెంట్‌ ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా... అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం కలికిరిలో నిర్వహించిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సభకు బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు...,తెలుగుదేశం, జనసేన నాయకులు నారా లోకేశ్‌, నాగబాబు హాజరుకాగా వనరులపరంగా రాయలసీమకు ఎలాంటి లోటు లేన్నప్పటికీ... కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీని నమ్మి అధికారంలోకి తెస్తే ఇక్కడి ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. NDA సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమన్న మోదీ పుంగనూరులో వైసీపీ మంత్రి రౌడీయిజం చేస్తున్నారంటూ పరోక్షంగా పెద్దిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాయలసీమలో అభివృద్ధిని కొత్త శిఖరాలకు చేరాలన్నదే తన లక్ష్యమని మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎన్నో ఆశలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని... కానీ జగన్ ప్రజల విశ్వాసాన్ని దెబ్బ కొట్టాడని ప్రధాని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇక్కడి పేదలను విస్మరించి మాఫియాను అభివృద్ధి చేసిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలోని మంత్రి... ఇక్కడ గూండాయిజం ఎలా చేస్తారో రౌడీ రాజ్యాన్ని ఎలా నడిపిస్తారో... అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియావల్ల అన్నమయ్య డ్యామ్‌ కూలిపోయిందని, 25 నుంచి 30పల్లెలకు నష్టం జరిగిందని తెలిసి తాను ఎంతో ఆందోళనకు గురయ్యానని ప్రధాని తెలిపారు. ఎంతో మంది ప్రాణాలు పోయాయని... ఇలాంటి మాఫియాకు ఇక్కడి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. ఆ మాఫియాకు తాను ఒక్కటే మాట చెబుతున్నానని... వైసీపీ ప్రభుత్వం పోవడానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని మోదీ తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వస్తూనే ఇక్కడి ప్రతి మాఫియాకు చెక్‌ పెడుతుందని, పక్కా ట్రీట్‌మెంట్‌ చేస్తుందన్నారు.

రాయలసీమలో తీవ్రమైన తాగు, సాగు నీటి కొరత ఉందని గుర్తుచేసిన ప్రధాని....... NDA అధికారంలోకి వచ్చాక అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. రాయలసీమలో చేపట్టిన అభివృద్ధి పనుల్ని గుర్తుచేసిన ప్రధాని నంద్యాల-ఎర్రగుంట్ల రైల్వే లైను పూర్తయిందని., కడప విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సహా. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతామని తెలిపారు. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తామని, టమాటా నిల్వ చేసేందుకు గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News