ABV: పౌరసమాజం నుంచి ఏబీవీకి విశేష మద్దతు
ప్రభుత్వ ఎత్తుగడను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు;
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. క్యాట్ ఆదేశాలున్నా విధుల్లోకి తీసుకోకుండానే పదవీ విరమణ చేయించాలనే ప్రభుత్వ ఎత్తుగడను తప్పుబడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లు పెడుతున్నారు. జస్టిస్ ఫర్ ABV పేరిట ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వేలాది మంది సంతకాలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన సంతకాల సేకరణకు ఛేంజ్ డాట్ O.R.Gలో చక్కటి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకూ 20 వేల మంది సంతకాలతో పాటు తమ అభిప్రాయాలను నమోదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎంతో మంది ఆయనకు అండగా నిలుస్తున్నారు. ఏబీవీకి న్యాయం చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ I.P.S అధికారికి గౌరవప్రదంగా పదవీ విరమణ చేసే హక్కు లేకుండా చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు.
తీర్పు ఇచ్చినా..
ఈ నెల 8న హైదరాబాద్‌లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదంటూ తీర్పు వెల్లడించిన సంగతి తెలిసందే. ఆ తీర్పుకు సంబంధించిన పేపర్లు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చాయి. ఆ వెంటనే ఏబీవ వెంకటేశ్వరరావు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి ఆ తీర్పు ప్రతుల్ని అందజేశారు. తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.. ఈ మేరకు దరఖాస్తును కూడా అందజేశారు. వారం క్రితం సీఎస్‌ను కలిసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఈసీ దగ్గర అనుమతి పొందిన తర్వాత ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్‌కు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన సంగతి తెలిసిందే.
2019 నుంచి వేధింపులే
ఏబీ వెంకంటేశ్వరరావు 2019 ఎన్నికల తర్వాత ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ లేకుండా పోయింది. ఆయన్ను రెండుసార్లు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. క్యాట్‌ను ఆశ్రయించిన తర్వా త తీర్పు అనుకూలంగా వచ్చింది. అయినా సరే ఆయనకు మాత్రం పోస్టింగ్ మాత్రం దక్కలేదు. రెండువారాల సర్వీస్ మాత్రమే ఉండటంతో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 31తో సర్వీస్ పూర్తి కానుండటంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఈలోపు పోస్టింగ్ వస్తుందా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.