TDP PROTEST: ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు

రాత్రి వేళ కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు... చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమంటున్న తెలుగుదేశం శ్రేణులు;

Update: 2023-09-17 00:45 GMT

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుపై ఏపీవ్యాప్తంగా నిరసన జ్వాలలు శనివారం రాత్రి కూడా కొనసాగాయి. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జిల్లాల్లో ప్రజలు కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శ నిర్వహించారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలోని కమల సెంటర్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు తెలుగుదేశం ఆధ్వర్యంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. మైలవరంలో కొవ్వొత్తులు, సెల్ ఫోన్‌ లైట్లుతో నిరసన ప్రదర్శన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వ అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయవాడ చిట్టినగర్ కూడలిలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ జరిగింది.


చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో కాగడాలతో ర్యాలీ జరిపారు. పలాసలో గౌతు శిరీష ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో తెలుగుదేశం నేత కళా వెంకట్రావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో కాగడాలతో ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రింగ్ రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెహ్రూ చౌక్ వరకు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మార్గం మధ్యలో పోలీసులను అడ్డుకోవడంతో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో మహిళలు కొవ్వోత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళలు నల్ల చీరలు ధరించి, కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన జరిపారు.


బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా కొవ్వుత్తులతో నిరసన తెలుపుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను మండలాల్లో ప్రజలు భారీ ఎత్తున కొవ్వుత్తుల ప్రదర్శన నిర్వహించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. మాచర్లలో తెలుగుదేశం నాయకులు నిర్వహించిన క్యాండీల్‌ ర్యాలీని పోలీసులు అడ్డుకుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కొవ్వొత్తులను పోలీసులు ఆర్పివేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

Tags:    

Similar News