టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు బోరబండ భాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రమాదానికి కొన్ని గంటల ముందు తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన పోస్ట్ చేసిన వీడియో అందరిని కలిచి వేస్తుంది. సరదాగా స్నేహితులతో గడిపేందుకు గండిపేట వెళ్లారు భాను. అక్కడ సంతోషంగా పార్టీ చేసుకున్న ఆయన..." గండిపేట వచ్చా...ఫుల్ ఎంజాయ్ చేస్తున్న" అంటూ తన ఫ్రెండ్స్ తో సరదాగా గడిపిన వీడియో ను షేర్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మృత్యువు వెంటాడడం కంటతడి పెట్టిస్తోంది.
తన మిత్రుడి ఆహ్వానం మేరకు గండిపేట వెళ్లిన ఆయన తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బొత్కూర్ సమీపంలో ఆక్సిడెంట్ అవ్వడంతో భాను తీవ్ర గాయాల పాలయ్యారు. స్పాట్ లోనే ఆయన చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. భాను ఆకస్మిక మరణం తో ఆయన స్నేహితులు విషాదం లో మునిగిపోయారు. భాను ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాడని… ఈ వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టం గా ఉందని ఆయన సహచర నటులు స్పందించారు. ఎంతో సాదాసీదాగా, ఫన్నీ పర్సన్‌గా చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు భాను. కాగా పలువురు ప్రముఖులు భాను ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.