ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆదివారం ఓ హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కొత్తపేట మండలం రాయచోటి గ్రామానికి చెందిన శ్రీనివాస్, సరస్వతి దంపతులకు జయప్రకాష్ నారాయణ్, ప్రశాంతి సంతానం. జయప్రకాష్ నారాయణ్(35) ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 22న జయప్రకాష్ నారాయణ్ కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం ఊరికి తిరిగి వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. రాత్రి అయినా ఇంటికి చేరకపోవడంతో ప్రశాంతి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే జయప్రకాష్ నారాయణ్ సొంతూరికి వెళ్లకుండా మియాపూర్ మదీనాగూడలో ఓ లాడ్జిలో రూమ్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం వరకూ గది నుంచి అతను బయటకి రాకపోవడంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించాడు. దీంతో సిబ్బంది మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జయప్రకాష్ నారాయణ్ కొంతకాలంగా ఫిట్స్‌తో బాధపడుతున్నాడని, ఫిట్స్‌తో మృతి చెందాడా లేక మరేదైనా కారణమా అనే కోణంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.