తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ నెల 15 వరకు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. నేడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉందని తెలిపారు.
నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అక్కడకక్కడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక ఏపీలో మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఉభయగోదావరి, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని తెలిపింది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.