AP: ఏపీకి భారీగా తరలివస్తున్న టెకీలు

ఏలాగైనా వస్తాం.. సరైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ ప్రతిన.... సరిపోని రైళ్లు, బస్సులు

Update: 2024-05-09 04:00 GMT

హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తుతున్నారు. ఒకేసారి ఎక్కువ సంఖ్యలో రానుండడంతో రైళ్లు, బస్సులు సరిపోవడం లేదు. అయినా సరే ఏలాగైనా వస్తాం.. సరైన ప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ... ప్రతిన బూనారు. ఓట్ల పండుగకు ప్రజలు పోటెత్తుతున్నారు. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, లోక్ సభ ఎన్నికలు ఉండడంతో బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు ఓటేసేందుకు భారీ సంఖ్యలో బయలుదేరి వెళుతున్నారు. ప్రతి ఎన్నికల్లో తాము ఓటు హక్కును వినియోగించుకుంటామని.. ఈసారి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటామని పేర్కొంటున్నారు. అభివృద్ది చేసే వాళ్లకే తమ ఓటు వేస్తామని హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. ఎలాగైనా సరే వెళ్తాం..ఓటేస్తాం అంటున్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఏపీ వైపుకు వెళ్లే బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అన్న తేడాలేకుండా అన్ని బస్సుల్లో సీట్లు నిండుకున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సుల్లో అన్ని విభాగాల రిజర్వేషన్లు అయిపోయాయి. రైళ్లలో నెల క్రితమే అయిపోయి.. వెయిటింగ్ లిస్టులు వందల్లో కన్పిస్తున్నాయి. పలు రైళ్లలో ఏకంగా రిగ్రేట్ కు వెళ్లిపోయాయి. ఈనెల 13న ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఏపీ వైపు ఈ వారం భారీగా ప్రయాణాలు ఉన్నాయి. ఈ రద్దీని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్-విశాఖపట్నం ప్రైవేటు స్లీపర్ బస్సు టికెట్ ధర ప్రస్తుతం రూ.4వేలు పలుకుతుందని వాపోతున్నారు.

సోమవారం ఎన్నికలు ఉండడంతో చాలా మంది రెండు మూడు రోజుల ముందే వెళ్లాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లోని చాలామంది ఉద్యోగులు శుక్ర, శనివారాల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు పెట్టినా అన్నింట్లోనూ సీట్లు నిండుకున్నాయి. ఏపీ, సూపర్ గ్జరీ, ఆల్ట్రా డీలక్స్ బస్సులు ఎన్ని వేసినా నిండిపోతున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంకా అదనంగా నడిపేందుకు బస్సులు లేకపోవడంతో ఏపీ.ఎస్.ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ లనూ సిద్ధం చేస్తోంది. అలాగే బెంగళూరు నుంచి విజయవాడకు 10వ తేదీన ప్రత్యేక బస్సులతో కలిపి 21 సర్వీసులు ఏర్పాటు చేయగా.. ఒక్క సీటూ కూడా మిగల్లేదని వాపోతున్నారు. 11వ తేదీన 16 బస్సులు ఉండగా అవి కూడా నిండిపోవడంతో మరో ప్రత్యేక సర్వీసును ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు బస్సు ప్రయాణం 12 గంటలకు పైగా పడుతుండటంతో ఏపీ స్లీపర్ బస్సులకు డిమాండు ఏర్పడింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్లు వెనుక సీటు, ముందు సీటు, కింది బెర్తూ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. కొన్ని బస్సుల్లో లోయర్ బెర్తుకు రూ.4,566లుగా నిర్ణయించారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈసీజన్ లో ఎప్పుడూ లేనంతగా ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు పెంచేశారని ఆరోపిస్తున్నారు. ఈ అడ్డగోలు దోపిడీ బహిరంగంగా.. వెబ్ సైట్ల ద్వారానే కొనసాగుతుంది. ఇంత జరుఉతున్నా..రవాణాశాఖ అదికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Tags:    

Similar News