గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు రూ.8 కోట్ల వరకు నగదు, రూ.25 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల వేళ అంత పెద్దమొత్తంలో నగదు లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ డబ్బు, పత్రాలు మంగళగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థికి చెందినవని అనుమానిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు అధికారులు, పోలీసులు... ఇటీవల వైకాపా అభ్యర్థితో పాటు వారి బంధువుల ఇళ్లపై నిఘా పెట్టారు. దీంతో వారు అప్రమత్తమై తమకు సన్నిహితుడైన వస్త్ర వ్యాపారి ఇంట్లో పెద్దమొత్తంలో డబ్బు, ఆస్తి పత్రాలను ఉంచినట్లు భావిస్తున్నారు.
నేడు చంద్రబాబు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. మ.12.30 నుంచి 1.30 గంటల వరకు నంద్యాల సభలో పాల్గొంటారు. సా.3.30 నుంచి 4.30 గంటల వరకు చిత్తూరులో ప్రచారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. కాగా, ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మధ్యాహ్నం 12.30 గంటలకు ఏలూరు జిల్లా కైకలూరు, మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.